అంతర్గతం

poetry
telugu
sonta-kavitvam
Published

December 14, 2017

నా ఆనంద సామ్రాజ్యానికి
వాకిలివి నువ్వన్న భావనలో
నాకూ ఆనందానికీ మధ్య
నువ్వొక్కత్తివే అడ్డన్న భావం
ఎంతలేదన్నా అంతర్గతం.

కాల ప్రవాహంలో తేలుతూ మునుగుతూ
జారుతూ దొర్లుతూ, ఒకరికొకరు తగులుతూ
ముట్టుకుంటూ తట్టుకుంటూ ఒరుసుకుంటూ
గందరగోళంగా సగం జీవితం గడిపిన తర్వాత

గట్టిగా ఊపిరి బిగబట్టి
లోతులోకి దూకి
ఒక్క క్షణాన్ని దొరకబుచ్చుకుని
ఒకరినొకరం తడిమి చూసుకుంటే

ఎవరికి వాళ్ళం, ఒకళ్ళకి ఇంకొకళ్ళం
కల్పించుకున్న అస్పష్టమైన ఆకారాలు
తగుల్చుకున్న దెబ్బల తాలూకూ
మానిన మచ్చలు, ఆరని గాయాలు

ఒకరి గట్టితనం తగిలిన చోటల్లా
ఇంకొకరికి ఒళ్లునొప్పులు
కొద్దికొద్దిగా బీటలుపడుతున్న
ఒకప్పటి మధురభావాలు

అయితేనేం, మనం ఒకరికొకరం, ఒకరినొకరం,
ఒకరితో ఒకరం పొందింది ఆనందం
ఎలాగైనా కలిసి ముక్కలు కావలసిన వాళ్ళం
చెట్టాపట్టాలేసుకుని, పోదాం మళ్ళా ప్రవాహంలోకి.