గడుగ్గాయి రుక్మిణి
ఎవరెంత పరమేశ్వర భక్తి తత్వం చెప్పినా నాకు మాత్రం రుక్మిణీ కళ్యాణం గొప్ప ప్రేమ కథ. కొంచెం ఆలోచిస్తే పూర్తిగా ఆధునిక ప్రేమ కథ. రుక్మిణి మహా గడుగ్గాయి, అసలు సిసలు తెలుగు హీరోయిన్.
రుక్మిణి తనంతట తాను కృష్ణుణ్ణి వరించి, వచ్చి నన్ను తీసుకుపోయి పెళ్లి చేసుకో అని సందేశం పంపుతుంది. ‘ఏమిటీ ఈ అమ్మాయి ఇలా తెగించింది’ అని కృష్ణుడు అనుకుంటాడేమో అన్నట్టు ఈ మాటలు అంటుంది, చూడండి.
ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
కన్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్?
కులం, రూపం, యౌవనం, సౌజన్యం, ధనం, బలం, దానం, పరాక్రమం, కరుణ ఇలా ఇన్ని మంచి గుణాలు ఉన్న నిన్ను ఏ కన్య కోరకుండా ఉంటుంది?
తెలుగులో ఇన్ని లక్షణాలు చెప్పిన రుక్మిణి సంస్కృతంలో ఇంకో మాట కూడా అంటుంది. ఆత్మ తుల్యం – నీకు నీవే సాటి అయిన వాడివి – అని.
का त्वा मुकुन्द महती कुलशीलरूप-
विद्यावयोद्रविणधामभिरात्मतुल्यम् ।
धीरा पतिं कुलवती न वृणीत कन्या
काले नृसिंह नरलोकमनोऽभिरामम् ॥
మరి అటువంటి వాడు కనిపించినప్పుడు వాడి మీద మనసు పడకుండా ఎలా అని మనం కూడా ఒప్పేసుకుంటాం కదా! అయితే తెలుగు రుక్మిణి అంతటితో ఆగదు. నిన్ను చూసి కన్యలు మోహించటం నీకు కొత్తా ఏమిటి, లక్ష్మీ దేవి నిన్ను వరించలేదా? అంటుంది. ఇంకా ముందుకు వెళ్ళి ఇదేమైనా లోకానికి కొత్తా, మోహం అనేది నాతోనే పుట్టిందా ఏవిటి, అని కూడా అనేస్తుంది.
గట్టిగా హీరో చెయ్యి పట్టేసుకుని “నిన్ను వదలను రా” అంటున్న తెలుగు సినిమా హీరోయిన్ కళ్ళముందు కదలెట్లేదూ!!