ఇద్దరమ్మాయిల కథ

musings
farmhill
Published

November 1, 2020

ఒకమ్మాయి వచ్చింది, మమ్మల్ని చూడటానికి ఇవ్వాళ. కాలు నొప్పితో నేనున్న మంచం ముందు, కుర్చీలో వాళ్ళ నాన్న వొళ్ళో దర్జాగా కూర్చుంది.

తెలుగురానిపిల్ల. పేరడిగితే చెప్పింది. ఏం చేస్తుంటావు అంటే బొమ్మలేస్తుంటాను, క్రాఫ్ట్ చేస్తాను, పుస్తకాలు చదువుతాను అని చెప్పింది, ఫలానా బళ్ళో ఫలానా తరగతి అనకుండా. ఏ బడి, ఏ తరగతో చివరికి నేను అడిగితేగానీ చెప్పలేదు.

మిగతా అందరూ మాట్లాడేసి, కిందకెళ్లి, వాళ్ళవాళ్ళ పనుల్లో మునిగిపోయాక, మళ్లీ పైకొచ్చింది నాతో మాట్లాట్టానికి.

ఇది ఒక బడి అనీ, నేను టీచర్ననీ, తన ఫ్రెండు ఆరేళ్ళ అవీ ఇక్కడే చదువుకుంటున్నాడనీ చెప్తే తన ఆశ్చర్యానికి అంతేలేదు. “మా బడి ఇట్లా ఉండదు. పొద్దుట్నుంచి సాయంత్రం దాకా ఒకే రూములో కూర్చుంటాం,” అన్నది నిర్లిప్తంగా. నేను అడిగితేగానీ బయటపడలేదు, అక్కడ బోరు కొడుతుంది అని. ఒక అరగంట సేపు వాళ్ళ ఇంటిదగ్గర పిల్లుల గురించి, ఇంటి ముందు లేక్ గురించి, తన ఫ్రెండ్స్ గురించి చెప్పింది. కిందకెళ్లి పిల్లులతో, కుక్కలతో ఆడుతూ, చెట్ల చుట్టూ తిరుగుతూ కూడా నాలుగైదు సార్లు వచ్చిపోయింది పైకి.

సాయంత్రం ఒక బంతిపూల మొక్క తీసుకుని బయల్దేరింది. బై అని చెయ్యి ఊపుతూ పావుగంట నిలబడింది. ఉండమంటే ఉండదు, వెళ్ళటానికి మనసు రాదు. ‘ఈ వారం ఉండు’ అని అననయితే అంటాం, వాళ్ళ అమ్మా నాన్నా కూడా ‘ఉండాలనుకుంటే ఉండు’ అంటారు కానీ ఆ చిన్న ప్రాణానికి అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటుంది? వెళ్లలేక వెళ్లలేక వెళ్ళింది. నాకైతే ఇంకా కళ్ళలోనే ఉంది.

నాకు తెలిసినంతవరకూ వాళ్ళ అమ్మా నాన్నా మళ్లీ ఇక్కడికి పంపించరు. పిల్లకి ఇక్కడ అలవాటయితే మళ్లీ సిటీలో బడికి పోనని మారాం చేస్తుందేమో అని వాళ్ళ భయం.

పోయినవారం ఇంకో పిల్ల వచ్చింది. ఒక వారం ఇక్కడే ఉన్నారు అమ్మా నాన్నా అక్కా ఆ పిల్లా అందరూ. చివరికి బయలుదేరే రోజు అక్క గుడ్లలో నీళ్లు కుక్కుకుని కారెక్కింది. ఈ పిల్ల నేను రానంటే రానని అడ్డం తిరిగింది. సరే ఇంకో రెండు రోజులు ఉండి వెళ్తావా అంటే కాదు రెండు నెలలు ఉంటాను అంటుంది. ఏడుపులు, పెడ బొబ్బలు, ఆరేళ్ళ వయసులో పెల్లుబికే దుఃఖం.

సరే ఏమిటి ఇబ్బంది వెళ్ళటానికి అంటే, ‘ఇక్కడ చెట్లున్నాయి, ఇంట్లో లేవు’. దీనికి మన దగ్గర సమాధానం లేదు. ‘ఇక్కడ పిల్లులున్నాయి’. ‘సరే ఒక పిల్లిపిల్లని తీసుకెళ్లు’ అంటే కాదు ఆరు పిల్లులూ రావాల్సిందే. ‘ఇంట్లో నాతో ఆడుకోవటానికి ఎవరూ లేరు’ అంటే వెంటనే వాళ్ళ నాన్న ‘అదేంటీ అందరం ఉన్నాం కదా, నువ్వు పిలవగానే ఆటకి వస్తాం కదా’ అన్నాడు, అమ్మయ్యా ఒక పాయింటు దొరికింది అనుకుంటూ. అప్పుడేసింది పిల్ల ఒక దెబ్బ, ‘నువ్వు పిలిస్తేగానీ రావు, ఇక్కడ పిల్లులు పిలవకుండానే వస్తున్నాయి’ అని. అంతే. అంతా గప్ చుప్ సాంబార్ బుడ్డీ.

కొంచెం తేరుకుని, ‘నువ్విక్కడ ఉండిపోతే నిన్నెవరు చూసుకుంటారు?’ అంది అమ్మ. ‘ఇక్కడ బోలెడు మంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, లేపోతే నన్నునేనే చూసుకుంటా.’ ఇక వేరేమాటలేదు. చివరికి ఇంకో రెండురోజులు ఉండి, ఎలానో సమాధానపడిగానీ వెళ్ళలేదు ఆ పిల్ల.

ఇదంతా కోవిడ్ వల్ల అనుకోవచ్చు మనం. ‘పిల్లలు మరీ ఇళ్లలో బందీలై పోయి గాలికీ, చెట్లకీ మొహం వాచి ఉన్నారు, ఈ మహమ్మారి వదిలితే అదే అంతా సర్దుకుంటుందిలే’ అని సమాధానపడచ్చు. కానీ మన ఉద్యోగాలూ, పిల్లల చదువులూ, వాళ్ళ భవిష్యత్తు గురించి మన ప్రణాళికలూ వీటన్నిటి మీద మనకి ఉన్న దృష్టి మన పిల్లలమీద, వాళ్ళ అనుభవాలు, అనుభూతులు, ఆలోచనల మీదా లేదనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఇది మారటం అవసరం. తర్వాత మీఇష్టం.