కృష్ణా, నీ ప్రేమలో…

poetry
sonta-kavitvam
Published

January 24, 2021

కృష్ణా,

చలికాలం మెల్లగా వెళ్లిపోతోంది
చల్లదనాన్ని అల్లుకుని ఆపటానికి
మామిడి చెట్లు చిగురాకుల చేతులు చాస్తున్నాయి

వెన్నెల మెల్లగా వెచ్చబడుతోంది
వెచ్చటి వెన్నెల్ని పచ్చనాకులతో తాగి
మామిడి చెట్లు ముద్దుగా మొగ్గలు తొడుగుతున్నాయి

వసంతం కోసం వేచి చూస్తూ సూరీడు
మెలమెల్లగా చలచల్లగా వేడెక్కుతూ
మామిడి చెట్ల ముద్దు మురిపాలపైన వెలుగుతున్నాడు

వెచ్చటి వెన్నెలనీ, చల్లటి వెలుగునీ,
మత్తెక్కించే మామిడి మొగ్గల సువాసననీ
గుండెల నిండా నింపుకుని
నిన్నే పలవరిస్తున్నాను.
నువు లేనితనాన్ని అనుభవిస్తున్నాను.

ఆ పలవరింపులోనే నువ్వున్నావు
ఆ లేనితనంలోనే నిన్ను ప్రేమిస్తాను
నాకు తెలీదా – నీ ప్రేమే లేకపోతే
ఈ వెన్నెలా, ఈ వెలుగూ, ఈ మత్తూ
నన్నింతలా అణువణువునా ఆవహించవు.