మేఘదూతం – ఒక శ్లోకం

classics
poetry
sanskrit
Published

September 9, 2022

గత వారం పదిరోజులుగా అక్కడా ఇక్కడా తిరుగుతూనే ఉన్నాను. చేతిలో పుస్తకాలు ఉన్నా, కూర్చుని చదివే తీరికా, ఓపికా లేకపోయాయి. అయితే, నేను ఎప్పటినుంచో సంస్కృత కావ్యాల గురించి పండితులెవరైనా ఉపన్యాసాలు ఇచ్చి ఉంటే వినాలని అనుకుంటూ ఉన్నాను. ఫోను చేతిలో ఉండటం వల్ల, వెతకటం మొదలు పెట్టాను. అలా దొరికిన కొన్ని రిసోర్సెస్ ఇక్కడ ఇస్తున్నాను.

వెంపటి కుటుంబ శాస్త్రి గారు మేఘదూతం గురించి ప్రసంగించిన ఆడియోలు archiveలో దొరికాయి. ఈ ఉపన్యాసాలు పూర్తిగా సంస్కృతంలో ఉన్నాయి. ఏదో సంస్కృత కళాశాల విద్యార్థుల సమావేశంలో మాట్లాడినవి కావచ్చు. పరిచితమైన ‘తన్వీ శ్యామా…’ తో ఉపన్యాసం మొదలుపెట్టటం వల్లనో ఏమో ఆయన మాట్లాడిన సంస్కృతం సులభంగానూ, మల్లినాథ వ్యాఖ్య ఆయన చదివి చెప్పిన తీరు, చాలా గొప్పగానూ అనిపించింది.

అక్కడి నుంచీ మొదట ఎవరీ శాస్త్రి గారూ అని చూస్తే, సంస్కృత భాష వ్యాప్తికి ఆయన చేస్తున్న కృషి కనబడింది. సంస్కృతం సొంతంగా నేర్చుకోవటానికి కొద్ది ఫీజులో రక రకాల కోర్సులు ఉన్నాయి. అలానే ఇంకో సైటులో ఆరవతరగతి నుండీ NCERT సంస్కృత పాఠ్య పుస్తకాలలో ఉన్నా పాఠాలు సంస్కృతంలో ఆడియో వీడియో రూపంలో ఉన్నాయి. ఇవి సంస్కృత అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడతాయి.

శాస్త్రిగారి ఉపన్యాసం అర్థమవటంతో కొంచెం ఉత్సహించి వెతికితే, మేఘదూతం మూలం దేవనాగరిలోనూ, మల్లినాథ సూరి వ్యాఖ్యాసహితంగా తెలుగు లిపి లోనూ, విద్వాన్ కోసూరు వెంకట నరసింహ రాజు మల్లినాథ వ్యాఖ్యని అనుసరించి తెలుగులో రాసిన పుస్తకమూ దొరికాయి. చదువుకుంటున్నాను. ఒక్క శ్లోకం ప్రస్తావిస్తాను.

పూర్వ మేఘం, ఏడవ శ్లోకం

సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయాః
సందేశం మే హర ధనపతిక్రోధ విశ్లేషితస్య ,
గన్తవ్యా తే వసతి రలకా నామ యక్షేశ్వరాణాం
బాహ్యోద్యాన స్థితహరశిరశ్చంద్రికాధౌత హర్మ్యా

సంతప్తులకు (వేగిపోతున్నవారికి – ప్రవాసం చేతనో, ఎండ బాధతోనో) నువ్వే రక్షకుడివి (ప్రవాసం వెళ్ళిన వాళ్లు వర్షాకాలానికి తిరిగి ఇంటికి వస్తారు. ఎండల నుండీ మేఘుడి వర్షం రక్షిస్తుంది). కాబట్టి శాపం వల్ల భార్యకి దూరమైన నాకు నువ్వే రక్ష. నా సందేశం నువ్వే తీసుకెళ్లాలి. ఇది ముందరి కాళ్ళకి బంధం.

నువ్వు తప్పనిసరిగా అలకా నగరానికి వెళ్లాలి. అది ఎటువంటిది? దాని గొప్పతనం గురించి చిన్న చిన్న విషయాలేవీ చెప్పటం లేదు యక్షుడు. ఏకంగా బాహ్య ఉద్యాన స్థిత హర శిరః చంద్రికా ధౌత హర్మ్యా అన్నాడు. అంటే, కైలాసంలో బయటి ఉద్యానవనంలో కూర్చున్న శివుడి తల మీద ప్రకాశిస్తున్న చంద్రుడి వెన్నెలలో తెల్లగా మెరుస్తున్న భవనాలు కలది, అని. అలకాపురం కైలాసం పక్కనే ఉన్నది, అప్పుడప్పుడూ సాక్షాత్తు శివుడే కనిపిస్తుంటాడు. ఇంతకన్నా గొప్ప ఆకర్షణ ఏముంటుంది?

అయితే ఈ శ్లోకం చూడగానే నాకు కాళిదాసు గురించి ప్రసిద్ధమైన చాటు కథ ఒకటి గుర్తుకొచ్చింది. కాళిదాసు భోజరాజు ఆస్థానంలో ఉండేవాడనీ, భోజుడు కవులని చాలా ఆదరించేవాడనీ కథా సాంప్రదాయం. ఒక పేద బ్రాహ్మడు ఎలాగోలా భోజ రాజు దగ్గర ఒక పద్యం చెప్పి కడుపు నింపుకోవాలనుకున్నాడట. కష్టపడి శ్లోకం లో రెండు పాదాలు రాశాడు – భోజనం దేహి రాజేంద్ర, ఘృత సూప సమన్వితం – రాజా, పప్పు, నెయ్యితో భోజనం పెట్టించు. ఇక ముందుకు సాగటం లేదు. చివరికి కాళిదాసు దగ్గరికి వెళ్లి సహాయం అడిగాడట. ఆయన – మాహిషం చ శరశ్చంద్రచంద్రికా ధవళం దధి – శరత్కాలపు వెన్నెలలా తెల్లని పెరుగు కూడా – అని పూరించాడట. రాజుగారు శ్లోకం విని, ‘మొదటి భాగం సరే, ఆ రెండో భాగంలో అక్షరానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పంపండి’ అన్నాడట. మంచి కవిత్వం గుర్తుపట్టటం అలా ఉంటుంది అని కథ.

ఇది చాటు కవితగా ప్రచారంలో ఉన్నా, ఈ రెండు శ్లోకాల చివరి పాదాలు చూడండి.
1. బాహ్యోద్యాన స్థితహరశిరశ్చంద్రికాధౌత హర్మ్యా
2. మాహిషం చ శరశ్చంద్రచంద్రికాధవళం దధి
కథ మరీ పూర్తిగా కాకపోయినా, కొంత నిజమేమో అనిపించటం లేదూ?

https://archive.org/details/meghadUtam-01

https://www.samskrittutorial.in/class_six
learnsamskrit.online