మొన్ననే ఒక పెళ్లిలో కలిశాం

poetry
telugu
sonta-kavitvam
Published

January 21, 2018

“బాగున్నావా?” అని పలకరిస్తాన్నేను.
“ఆ, బాగున్నా. నువ్వూ?”, అంటావు.
జవాబు అవసరంలేని ఖాళీ ప్రశ్న అడుగుతూ.

నీ భుజం తడతాన్నేను
లేదా నువ్వు నా చెయ్యి పట్టుకుంటావు.
ఆ క్షణంలో పూర్వ సాన్నిహిత్యంతో కళ్లు మెరుస్తాయి.
“కూర్చో..ఆ, ఏంటి సంగతులూ?” అంటాన్నేను.
“ఏవుంది.. అంతా మామూలే”, కూర్చుంటావు నువ్వు.

ఈలోగా, గడిచిపోయి,
కాళ్ళ కింద నలిగి పడున్న కాలం,
ఆరిగామీ మడతలు విప్పుకుంటూ,
ఒళ్ళు విరుచుకుంటూ, ముళ్లపొదల కంచెలా
మనచుట్టూ లేచి నిలబడుతుంది.

పెళ్ళివాళ్ళు పెట్టుకున్న ఫోటోగ్రాఫరు
రెండు క్లిక్కులు తీసేస్తాడు
‘ఆత్మీయ ముచ్చట్లు’ అని టైటిలు పెడతాడు, తర్వాత.

“నువ్వు చెప్పు, ఎలా ఉన్నారు మీరందరూ?”
‎”ఆ..ఏవుంది, అంతా మామూలే..”

పంచుకోవాల్సింది చాలా ఉండి
సందేహిస్తావు నువ్వు.
‘మనకెందుకులే’ అనుకుంటాను నేను.

ఇంతలో నాకింకొక నువ్వు, నీకింకొక నేను.

“బాగున్నావా?” అని పలకరిస్తావునువ్వు.
“ఆ, బాగున్నా. నువ్వూ?”, అంటాన్నేను.

పదిరోజుల తర్వాత ఇంకోచోట
“ఫలానా వారు మీకు బాగా తెలుసటగా..” అంటారొకరు నీ గురించి.
“అవును..మొన్ననే ఒక పెళ్లిలో కూడా కలిశాం”
అంటాన్నేను, కొంత అసంతృప్తిగా…