Nachiyar Thirumozhi – కర్పూరం నారుమో…
ఈ వారాంతంలో ఒక వైష్ణవ వివాహ మహోత్సవానికి వెళ్లటమూ, అక్కడ శ్రీమాన్ దుష్యంత్ శ్రీధర్ ప్రవచనం వినటమూ సంభవించింది. గోదా కళ్యాణం, ఉషా కళ్యాణం గురించి జనరంజకంగా ప్రసంగించారు.
సమకాలీన ప్రవచనకారులలో దాదాపు అందరిలో ఉన్న శాఖాచంక్రమణం, సనాతన ధర్మానురక్తి, ఆ సందర్భంగా మధ్యే మధ్యే రాజకీయ అభిప్రాయ ప్రకటన వంటి లక్షణాలు ఈయనకు కూడా ఉన్నప్పటికీ, మంచి స్వరం, సంగీత జ్ఞానం కూడా ఉన్నాయి. ఆయన ఎక్కువ తమిళము, కొంత కన్నడము, మధ్య మధ్య ఇంగ్లీషు, సంస్కృతమూ మాట్లాడటం వల్ల నాకు చాలా వరకూ అర్థం అయ్యిందనే చెప్పాలి. సరే, ఒక చెవి అటు ఉంచి వింటున్నానా, ఉన్నట్టుండి శ్రావ్యంగా ‘కర్పూరం నారుమో, కమల పూ నారుమో’ అని అందుకున్నాడు. ఆ పాశురము, వ్యాఖ్యానమూ వింటూనే నాకొక పరవశం వచ్చేసింది. పక్కనే ఉన్న మామగారిని అడిగితే అది గోదాదేవి చేసిన ‘నాచియార్ తిరుమొళి’ అనే స్తోత్రంలోనిదని చెప్పారు. ఇక గత రెండు రోజులుగా ఆ స్తోత్రం, వ్యాఖ్యానాలు, అనువాదాలలోనే మునిగి తేలుతూ ఉన్నానని చెప్పాలి.
తమిళ దేశంలో 5 నుంచీ 8వ శతాబ్దం కాలంలో జీవించిన పన్నెండు మంది ఆళ్వారులు చేసిన విష్ణు స్తోత్రాలను నాలాయిర దివ్య ప్రబంధం (నాలుగువేల దివ్య స్తోత్రాలు) పేరుతో నాదముని 9-10 శతాబ్దాలలో సంకలనం చేశారు. తమిళ వైష్ణవ సంప్రదాయంలో, ముఖ్యంగా తెంగలై శాఖలో, ఈ ప్రబంధానికి వేదంతో పాటు సమానమైన స్థానం ఉంది.
ఈ పన్నెండు మంది ఆళ్వారులలో గోదాదేవి ఒక్కతే స్త్రీ. ఈమె చేసిన తిరుప్పావై, నాచియార్ తిరుమొళి రెండూ దివ్య ప్రబంధంలో భాగాలుగా చేర్చి ఉన్నాయి.
ఈ రెండింటిలో ముప్ఫై పాశురాల తిరుప్పావై చాలా ప్రసిద్ధికెక్కినది. ఎంతలా అంటే దివ్య ప్రబంధం గురించి ఏమీ తెలియనివారికి కూడా తెలిసేటంతగా. తిరుప్పావైకి ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ఎన్నో అనువాదాలు ఉన్నాయి. తెలుగులో ప్రసిద్ధమైన అనువాదం దేవులపల్లి కృష్ణశాస్త్రి వారిది, ఇంకొక చెప్పుకోదగ్గ సమకాలీన వ్యాఖ్యానువాదం ‘మంచి వెన్నెల వేళ’ పేరుతో మన కొత్తావకాయ సుస్మిత రాశారు.
తిరుప్పావై స్తోత్రాలలో భక్తితో, తన స్నేహితురాళ్ళతో కలిసి పొద్దున్నే నిద్ర లేచి, పవిత్ర స్నానాలు, నోములు చేసిన గోదాదేవి, తిరుమొళి స్తోత్రాలలో మధుర భక్తి పూరితమైన ప్రేమతో, విరహంతో, గాఢమైన కోరికతో వినిపిస్తుంది. కొన్ని పాశురాలలో శృంగారేచ్ఛ వాచ్యంగా కూడా ఉండటం వల్ల వాటిని ప్రవచనాలలో వ్యాఖ్యానించరు. బహుశా ఇందువల్లనే తిరుప్పావై తెలిసిన వారికి కూడా తిరుమొళి తెలియదు, నాకు లాగా.
తిరుమొళిలో 143 పాశురాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క దానిలో పది పాశురాలు ఉండే ”పదిగం” అనే 14 విభాగాలలో కూర్చబడ్డాయి. ఒక్కొక్క పదిగంలో ఉన్న పాశురాలు ఒకే విషయం గురించిన స్తోత్రాలు అయిఉంటాయి. ఉదాహరణకి మొదటి పదిగం కామదేవుని ప్రార్థన. మూడవది వస్త్రాపహరణం. అయిదవ పదిగం కోయిల పాట. ఆరవ పదిగంలో గోదాదేవి తనకీ స్వామికీ కళ్యాణం జరిగినట్లు కలగంటుంది. ఇందులో మొదటి పాశురమే సినిమా పేరుగా అందరికీ తెలిసిన వారణం ఆయిరం.
వారణం ఆయిరం శూళవలం శెయ్దు
నారణ నంబి నడక్కిన్ఱాన్ ఎన్ఱెదిర్
పూరణ పొఱ్కుడం వైత్తుప్పుఱమెంగుం
తోరణం నాట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్
సకల సులక్షణ శోభితుడైన నారాయణుడు వెయ్యి ఏనుగుల వలయం మధ్యలో నడుస్తూ, తోరణాలు, స్తంభాలతో అలంకరించబడిన పురంలోకి వస్తుండగా అతనికి బంగారు పూర్ణకుంభంతో స్వాగతం పలకటం నేను కలలో చూశాను.
ఎనిమిదవ పదిగంలో తన విరహ వేదననీ, గాఢమైన కోరికనీ తెలియజేయడానికి మేఘాల ద్వారా తిరుపతిలో ఉన్న స్వామికి సందేశం పంపుతుంది. తొమ్మిది నుండీ పదమూడవ పదిగాలలో తను స్వామిని చేరుకోవటానికి చేసిన ప్రయత్నాలు వర్ణిస్తుంది. చివరిదైన పద్నాలుగవ పదిగంలో ఆండాళ్ స్వామిని పెళ్ళిచేసుకోవటంతో తిరుమొళి ముగుస్తుంది.
Image from Google search
నేను విన్న పాశురం ఏడవ పదిగంలో మొదటిది. ఇందులో ఆండాళ్, స్వామి పెదవులని తరచూ తాకుతూ ఉండే పాంచజన్యంతో మాట్లాడుతుంది, ప్రార్థిస్తుంది, తనని చూసి అసూయ కూడా పడుతుంది. ఇప్పటికి ఈ పాశురానికి ఒక ఇరవై అనువాదాలు, వ్యాఖ్యానాలు చదివి, పదిరకాలుగా పాడిన పాటలు విన్నతర్వాత, తెలుగు చేయకుండా ఉండలేక పోతున్నాను.
తమిళం తెలుగు లిపిలో:
కర్పూరం నారుమో, కమల పూ నారుమో
తిరుప్పవళ చ్చెవ్వాయ్ దాన్ తిత్తితిరుక్కుమో
మరుప్పుసిత మాధవన్ తన్ వాయ్ చ్చువయ్యుమ్ నాట్రముమ్
విరుప్పుట్రుక్కేట్కిన్రేన్ సొల్లాళీ వెణ్ సంగే
అనువాదం:
కర్పూర పరిమళమో కమలా పూ గంధమో
తిరు పగడపు కెమ్మోవి మరి తీయతీయందనమో
గజదంతదారుడు మాధవుని ముఖ సుగంధము, సురుచియునూ కోరి, తెలియగోరిన నాకు;
చెప్పవే శ్వేత శంఖమా!
ఈ స్తోత్రాలలో భక్తి, ప్రేమా నిజంగానే కర్పూర పరిమళము, కమల పూ గంధమే. వీటిని భక్తి పాటలుగానో, శృంగార కీర్తనలుగానో మాత్రమే కాక, ప్రేమ, కోరిక, ఆరాధనా ఎంత గాఢంగా ఉండగలవో తెలిపే ప్రేమలేఖలుగానూ, ఆ ప్రేమ శారీరక, మానసిక, ఆధ్యాత్మికతలాలలో ఎలా వ్యాపించి పూర్ణత్వం వైపు నడిపించగలదో చూపించే మార్గదర్శకాలుగానూ తెలుసుకున్న వారిది నిజమైన అదృష్టం.