పాదిరిగారి అబ్బాయి మరికొన్ని కథలు - ఒక స్పందన

books
telugu
Published

October 3, 2025

పోయినసారి హైదరాబాదు నవోదయకి పోయినప్పుడు పేరు చెప్పి అడిగి కొనుక్కున్న నాలుగైదు పుస్తకాలలో ఇండస్ మార్టిన్ గారు రాసిన ‘పాదిరిగారి అబ్బాయి మరికొన్ని కథలు’ ఒకటి. మార్టిన్ గారి ఫేస్బుక్ పోస్టులు చాలా చదివాను. ఆయన రాతల్లో రచనా కౌశల్యంతో పాటు వాస్తవమైన ప్రజాస్వామిక దృక్పథము, పీడిత పక్షపాతము నాకు కనబడతాయి. అయితే వారి పుస్తకం చదవటం ఇదే మొదలు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పిప్పరమెంటు బిళ్ళలని దాచుకొని, దాచుకొని తిన్నట్టు మెల్లమెల్లగా చదువుతూ ఇప్పుడే పూర్తి చేశాను. నాకు ఎంతగానో నచ్చిన ఈ పుస్తకం గురించి నాలుగు మాటలు రాయటమే ఈ ప్రయత్నం.

అసలు కథలలోకి పోక మునుపే నాకు నచ్చిన విషయం ఈ పుస్తకానికి ఒక సంపాదకుడు ఉండటం; ఆ సంపాదకుడు ఈ పుస్తకాన్ని, రచయిత దృక్పథాన్ని నిశితంగా పరిశీలించి, ఆ పరిశీలనను విపులమైన ముందుమాటలో పాఠకులతో పంచుకోవటం; అందులో భాగంగా ఒక ప్రచురణ సంస్థగా తాము ‘ఫాసిజానికి వ్యతిరేకంగా నిర్మాణం కావలసిన ప్రజా శ్రేణుల ఐక్యతకు అవసరమయ్యే వ్యూహ రచనకు సైనిక చర్యకు దోహదం చేసే రచనని’ ఆహ్వానిస్తున్నామని స్పష్టంగా ప్రకటించటం. ఇది పాతకాలపు పద్ధతిగా అనిపించ వచ్చు కానీ ఒక రచన గొప్పతనాన్ని అమ్ముడుపోయిన కాపీల లెక్కతోనూ, ఒక ప్రచురణ సంస్థను అచ్చేసిన పుస్తకాల సంఖ్యతోనూ, ఒక రచయితను సోషల్ మీడియా పాపులారిటీతోనూ అంచనా వేస్తున్న ఈ రోజుల్లో, ఇది ఎంత విప్లవాత్మకమైన చర్యనో మనందరికీ తెలుసు.

‘కవులు, రచయితలు, పాఠకులు, విమర్శకులు, సిద్ధాంత కర్తలు వేరువేరు కాదు, ఆలోచనా పరులైన ప్రతి వ్యక్తీ ఈ సమూహాలు అన్నింటికీ చెంది ఉంటారు’ అని నేను అనుకుంటాను. ఒక రచయిత రాసేది ఏదైనా - చివరికి అది శుద్ధ ఆత్మాశ్రిత భావకవిత్వమయినా సరే - రాయటం అనేది ఒక రాజకీయ చర్య. అలానే ప్రతి ఆలోచన వెంట, దాన్ని ప్రకటించే రాత వెనుక ఒక సామాజిక దృక్కోణం - అది ఆ రచయిత గమనించి, పరిశీలించుకున్నది అయినా కాకపోయినా - ఉండటం తప్పనిసరి. అలానే ఏ ఇతర స్పందన అయినా. అందువల్ల, నాకు నచ్చిన విషయాలలో రెండవది రచయిత తన రాజకీయ, సామాజిక తాత్వికతను స్పష్టంగా ప్రకటిస్తూ చక్కటి సిద్ధాంత నిర్మాణంతో ఒక వ్యాసం రాయటం. ఏదో ఒకటి రాయటం, అచ్చేయటం, ప్రచారం చేసుకోవటమే పరమావధిగా కనిపిస్తున్న ఈ రోజుల్లో తన రచనల వెనుక ఉన్న రాజకీయ, సామాజిక దృక్కోణాలను గమనించుకొని, పరిశీలించి, స్పష్టమైన ఒక క్రమంలో రాసి ప్రకటించటం ఎంతో నిబద్ధతను సూచిస్తుంది. ఇది ఇంకో విప్లవాత్మక చర్య. ఈ వ్యాసంలో రచయిత చేసిన ప్రతిపాదనలు, లేవనెత్తిన ప్రశ్నలు, రేకెత్తించిన ఆలోచనలు ఎంతో సబబుగా ఉన్నాయి.

నాలో ఉన్న ‘అకడెమిక్’ ఈ పై రెండు విషయాలను చూసుకుని చాలా సంతోషించాడనే చెప్పాలి.

ఇక కథల్లోకి వస్తే నాకు మొదట కనిపించింది వాస్తవికత. నేను నరసరావుపేటలో పుట్టిన వాణ్ని. ఇరవయ్యో శతాబ్దపు చివరి రోజుల్లో గుంటూళ్ళోనే నేను గూడా వింటరు యెలగబెట్టింది. పొగులంతా ఏసీ కాలీజీలో పంజేసిన లెచ్చిలేర్లే కొంతమంది పొద్దునా సాయంగాలం మాకు పాటాలు జెప్పేవోళ్లు. ‘ఫిల్టుల బ్యాగీ ప్యాంటు మీద ఎనకమాల పొడుగ్గా ఉండే టెయిల్ సొక్కా ఏసుకుని చేతులు మోచేతుల మీదికి మడిచి కళ్ళద్దాలు పెట్టుకుని’ కాలీజీకి వొచ్చే ‘ఒగిటో నంబరు సదవర్లు’ అని చదవగానే నా కళ్ళముందుకి ఒక నలుగురు నిజం క్లాస్ మేట్స్ వచ్చేశారు. వాస్తవికత వెనువెంటనే కనిపించింది భాష. పల్నాడు భాషని సజీవంగా పట్టుకున్నారు. ఆ తర్వాత మనసుని ఆకట్టుకునేది వాక్య నిర్మాణము, సున్నితమైన హాస్యమూ. ఇక కథన శైలి గురించి చెప్పాలంటే మార్టిన్ గారు రాసింది మౌఖిక కథన పద్ధతికి అనుగుణంగా అనిపించింది నాకు. ఒక్కళ్ళం కూర్చుని చదువుకునేకంటే పక్కన కూర్చుని ఎవరన్నా పెద్దగా చదివితే వింటే బాగుండే కథలు ఇవి.

కథలు చదువుతూ ఉండగా వేరు వేరు పాత్రలు, సంఘటనల ద్వారా మనకు కనిపించేది దళిత క్రైస్తవ ఆత్మ విశ్వాసము, క్రైస్తవ సమాజం, ఆచార వ్యవహారాల పట్ల, మత తత్వం పట్లా నిశితమైన లోచూపు నుంచీ వచ్చిన విమర్శ, కులవివక్షలో వివిధ కోణాలు, మిగతా సమాజం రకరకాలుగా బయట పెట్టుకునే లేకితనం. దీన క్రైస్తవాన్ని తిరస్కరించిన మార్టిన్ గారి కథల్లో సహజంగానే అస్సలు కనిపించనిది దీనత్వం, నిస్సహాయత.

కొద్దిగా నచ్చనివి - ప్రబోధ ప్రధానమైన ‘పులసోపాఖ్యానం’ ఈ సంకలనంలో చేర్చటం, ‘కరివేపాకు’ కథలో కొంచెం ఎక్కువైంది అనిపించిన మెలోడ్రామా. అయినప్పటికీ, నేను ఎంతో మమేకమై చదివి ఆనందించిన ఈ కథలు రాసిన ఇండస్ మార్టిన్ గారికి, ప్రచురణ కర్తలకు కృతజ్ఞతలు, అభినందనలు.

ఇండస్ మార్టిన్, 2021. పాదిరిగారి అబ్బాయి మరికొన్ని కథలు. సంపాదకుడు ఎ. కె. ప్రభాకర్. పర్స్పెక్టివ్స్ ప్రచురణలు. సామాజిక శాస్త్రం/సాహిత్యం.