పాలలో నలకలూ, James Herriot
ఈ మధ్య దగ్గర్లో ఉన్న పాలకేంద్రంలో పాలు తీసుకుంటున్నాం. ఈవేళ పాలు కాగబెడుతుంటే ఒక నలక కనిపించింది, నలకలు మామూలే, తీసి పడేసి ముందుకు వెళ్ళిపోవడమే.
అయితే పాలల్లో నలక చూసిన ప్రతిసారీ నాకు James Herriot (1916-1995) గుర్తొస్తాడు. Herriot రెండో ప్రపంచ యుద్ధ కాలంలో (1939) పశువుల డాక్టరుగా పట్టా పుచ్చుకొని, బ్రిటన్లో పల్లెటూళ్ళలో పనిచేశాడు. తర్వాత ఆ అనుభవాలను, సంఘటనలనూ ఆధారం చేసుకుని పుస్తకాలు రాశాడు.
ఈ కథలు సరదాగా, ఆహ్లాదకరంగా, మనసుకు మెత్తగా ఉంటాయి. చాలా కథల్లో జంతువులూ, వాటిని సాకే మనుషులూ పడే ఇబ్బందులకు రచయిత స్పందించే తీరు, ఏదో ఒక రకంగా ఆ ఇబ్బందులు తీర్చటానికి పడే తపనా, రైతులతో పనిచేసే విధానమూ చదువుతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది. రచయిత యొక్క సహృదయత, దయ, జంతు ప్రేమ, మనుషుల పట్ల ఆదరభావమూ కథలు చదువుతుంటే మనకు తెలుస్తూ ఉంటాయి. ఎనిమిది – పదేళ్ల పిల్లల నుంచీ అందరూ చదవవచ్చు.
ఇంతకీ నాకు గుర్తొచ్చిన సంఘటన…ఇందులో ఒక పెద్ద రైతు దగ్గర ఉన్న ఆవులు ఒక్కొకటిగా జబ్బు పడి చనిపోతుంటాయి. చూస్తే ఏదో విషం తిని చనిపోతున్నట్లు తెలుస్తుంది. ఆ విషం ఎక్కడి నుంచీ వాటి ఆహారంలోకి వస్తుందో కనిపెట్టలేకపోతారు. Herriotతో పాటు అతని సీనియర్ డాక్టర్ కూడా వచ్చి, అన్నిటినీ పరిశీలించి, అందరితో మాట్లాడి, రెండ్రోజులు నిద్ర లేకుండా పనిచేస్తారు. అయినా ఏమీ కనబడదు. ఒకటొకటిగా ఆవులు చనిపోతూనే ఉంటాయి.
మూడో రోజు పొద్దున ఆవులకి నీళ్ళు పెట్టిన బక్కెట్లు తిరిగి తీసుకెళుతుంటే ఎందుకో ఆపి చూస్తారు. అందులో ఒక నల్లటి చిన్న కప్పు లాంటిది తేలుతుంటుంది. అదేమిటని అడిగితే ఆ రైతు ఆవుల కొమ్ముల పదును తగ్గించటానికి ఎవరో ఆకు వైద్యుడు ఇచ్చిన మందు అని చెప్తాడు. ఆ మందుని అన్ని ఆవుల కొమ్ములకూ పూసి ఉంటారు, ఆవులు వంగి నీళ్ళూ అవీ తాగేటప్పుడు అది రాలి పడుతుంటుంది. అందులోనే ఆ విషం ఉంటుంది. అంత జాగ్రత్తగా అందరూ ఉన్నా, ఎంత ఆలోచించినా, ఇంత చిన్న విషయం అంత పెద్ద ప్రభావం చూపిస్తుందని ఎవరూ అనుకోరు.
Herriot రాసిన పుస్తకాల పేర్లు If Only They Could Talk (1970), It Shouldn’t Happen to a Vet (1972), ఇలా ఉన్నప్పటికీ ఈ పుస్తకాలను సంకలనాలుగా ప్రచురించారు.
All Creatures Great and Small (1972)
All Things Bright and Beautiful (1974)
All Things Wise and Wonderful (1977)
The Lord God Made Them All (1981)
ఈ నాలుగు పుస్తకాల పేర్లూ Cecil Francis Alexander అనే కవి 1848లో రాసిన ఒక ఆంగ్లికన్ ప్రార్థనా గేయంలో మొదటి నాలుగు పంక్తులు అవటం ఇంకో విశేషం.
అదీ పాలల్లో నలకల కథ, James Herriot పుస్తకాల పరిచయమూనూ.