పల్నాడు కథలు - సుజాత వేల్పూరి
సుజాత వేల్పూరి గారి ‘పల్నాడు కథలు’ (రెండవ ప్రచురణ, ఒక పబ్లికేషన్స్ ) పుస్తకం మొన్ననే చేతికి వచ్చింది. అసలేం రాశారో చూద్దాం అని ఈ పొద్దున చేతులోకి తీసుకున్న పుస్తకాన్ని పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేకపోయాను. ‘చదివించగలగటం’ అనే మొదటి లక్షణం ఈ కథలకు ఉన్నట్టే కదా!
స్థలము, కాలమూ
ఈ కథలన్నీ పల్నాడు, అందులోనూ ఎక్కువ వరకు పల్లెటూళ్ళలో వ్యవసాయ కుటుంబాల నేపథ్యంలో రాసినవి. ముప్పాతిక భాగం కథల్లో ముఖ్య పాత్రలు స్త్రీలు. ఆ స్త్రీలందరూ ఆత్మాభిమానము, సమర్థతా, మానవత్వము పుష్కలంగా ఉన్నవాళ్ళు. దాదాపుగా కథలన్నీ సుఖాంతాలనే చెప్పాలి.
మరి ఈ కథలు ఏ కాలంలో సెట్ చేయబడ్డాయి? 1980 నుంచీ 2000 మధ్య కాలంలో అని నాకు అనిపిస్తుంది. ఈ కాలపు ప్రత్యేకత ఏమిటి? భూమి చుట్టూ అల్లుకున్న సంపద సమీకరణాలు మారుతూ మెల్లమెల్లగా మార్కెట్ ప్రధానం అవుతున్న సంధి కాలం అది. ఒకే ఊళ్ళో తరతరాలుగా పాతుకుని ఉన్న కుటుంబాలలో నుంచీ ఒక తరం పిల్లలు పట్టణాలకి చేరుతున్న సమయం. ఉమ్మడి కట్టుబాట్ల నుంచీ వ్యక్తిగత స్వేఛ్ఛ వైపు ప్రయాణం ప్రారంభమైన రోజులు. ఈ మారుతున్న కాలంలో స్త్రీలు అణచివేతకి ఎలా స్పందించారో ఈ కథలలో మనకి కనిపిస్తుంది.
దృక్పథం
కథలన్నీ చదవటం పూర్తయ్యేసరికి నాకు తోచిన విషయం, ఈ రచయిత ఎంతో ఆశావహ దృక్పథం కలవాళ్ళు, అని. ఒక్క కథలో అనుకోకుండా చనిపోయిన మూర్తి తప్ప మిగిలిన వాళ్ళందరికీ వారి స్వాభిమాన పూరిత సాహస కృత్యాల తర్వాత విధి ఎంతో కొంత కలిసి రావటమే చూస్తాం.
మరి ఈ కథలు వాస్తవాలా లేక ఆయా పాత్రలు ఎలా స్పందిస్తే బాగుంటుందని రచయిత అనుకున్నారో అలా రాశారా? అంతటి అణిచివేతకి వ్యతిరేకంగా నిజ జీవితంలో స్త్రీలు ఇలా స్పందించే అవకాశాలు ఉన్నాయా? ఒక్క అడుగు వెనక్కి వేస్తే, అసలు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచీ వస్తున్నాయి? ఈ కథల్లో కనబడుతున్న వివక్ష, అణిచివేత మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారని మనకు తెలుసు. ఆ విషయం అందరమూ ఒప్పుకుంటాము. మరి దానికి ఈ కథానాయికల స్పందనలు మాత్రం సహజమా, కాదా అని మనకి ఎందుకు అనిపిస్తుంది?
ఇందుకు నాకు రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి.
ఒకటి మనకి ఈ జీవితాలతో దగ్గరి పరిచయం లేకపోవటం. ఈ రోజు ఉన్న పరిస్థితిలో చదువు లేని, ఆస్తులు లేని, ఎన్నో రకాల ఇతర రిసోర్సెస్ లేని వాళ్ళు తిరగబడి నిలబడగలరని మనం నమ్మలేక పోవటం. ఇందుకు సమాధానంగా ఈ కథల్లో కనిపించేటటువంటి పల్నాటి నాయకురాళ్ళని నేను కూడా చూశాను అని మాత్రం చెప్పగలను.
ఇంకొకటి, మన వర్గ దృక్పథమూ, పవర్ ఎలా పని చేస్తుంది అనే విషయంలో మనకి ఉన్న ఊహలు. వర్గ దృక్పథం ఉన్న చాలా మంది దృష్టిలో, పవర్ అనేది రెండు వర్గాల మథ్య అసమానంగా ఉంటుంది. ఒక వర్గం పీడకులు, ఇంకొక వర్గం పీడితులు. పీడితులు ఎప్పుడూ పీడించబడుతూనే ఉంటారు. పీడిత వర్గం అంతా మూకుమ్మడిగా తిరగబడి పీడక వర్గ ఆధిపత్యాన్ని కూలదోసినప్పుడే వారికి విముక్తి. వ్యక్తులుగా వారి శక్తికి ప్రాధాన్యత ఉండదు. విముక్తి వ్యక్తుల స్థాయిలోనో, చిన్న చిన్న అంశాలలోనో వచ్చినా అది నిజమైన శక్తి కాదు. ఇలా చూసినప్పుడు అణచబడిన వర్గానికి చెందిన స్త్రీలు వ్యక్తిగతంగా ప్రతిఘటించటం ఎప్పుడో ఎక్కడో గానీ జరగదు, అలా జరిగినా వారికి శక్తి రాదు, వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు. అయితే, ఇంకొక దృక్కోణం ప్రకారం పవర్ మానవ సంబంధాలలో, వికేంద్రీకరణ చెంది ఉంటుంది. పవర్ ఉన్న చోటల్లా ప్రతిఘటన ఉంటుంది. ప్రతిఘటన స్థానికంగానూ, చిన్న మోతాదులోనూ, పవర్ సంబంధాలలో అంతర్నిహితంగానూ ఉండవచ్చు. ఇలా చూస్తే ప్రతి వ్యక్తీ ప్రతిఘటించవచ్చు, ప్రతిఘటనలు విజయవంతం కూడా అవవచ్చు. సుజాత గారి కథలలో స్త్రీల ప్రతిఘటనలు నాకు ఇటువంటి మైక్రో ప్రతిఘటనలుగా, తమని అణగదొక్కాలని చూస్తున్న ప్రతి శక్తికీ ఎదురుతిరగటంగా కనిపించాయి. కాబట్టి ఈ రచయిత తాను చూసిన కొందరు స్త్రీల ప్రతిఘటనలను ఆశావహంగా అక్షరాబద్ధం చేశారని అనుకోవాలి.
మనం సాధారణంగా ‘సమాజంలో స్త్రీలు అణచివేతకి గురవుతున్నారు’ అంటాం. సమాజం అంటే ఎవరు? అణచివేత ఎక్కడినుంచీ వస్తుంది? వేరే కులం లేదా వర్గం వాళ్ళ నుంచా? నిజానికి ఆయా స్త్రీల జీవితాలలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న మనుషుల నుంచే వాళ్ళు ఎక్కువ వివక్ష, అణచివేత ఎదుర్కుంటున్నారు. ఈ అవగాహనని మనం ఈ కథల్లో స్పష్టంగా చూస్తాం. దాదాపుగా అన్ని కథలలోనూ ఈ కథానాయకురాళ్ళని అణిచివేయాలని చూసేది, వాళ్ళ మీద అధికారం చెలాయించేదీ వాళ్ళకి దగ్గరైన, అవబోతున్న వాళ్ళే. అణచివేతను సామాజక వ్యవస్థలో వర్గ భేదాల దృష్టితోనే కాకుండా, కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల మధ్య సంబంధాలలో ఒక భాగంగా చూపించటం ఈ రచయిత విజయాలలో ఒకటిగా చూడవచ్చు.
కథలు, కథన శైలి
ఇక కథల విషయానికి వస్తే నాకు అన్నిటికన్నా నచ్చిన కథ ‘మీ సంబంధం మాకు నచ్చలేదు’. మిగతా ఇంకొన్ని కథలలోలాగానే ఇందులో కూడా చివరికి ఆ అమ్మాయి “ఈ సంబంధం వద్దు” అనుకుంటుంది. అయితే ఆమె ఆ నిర్ణయం తీసుకోవటానికి కారణమైన వివక్ష తిట్లలాగానో, తన్నులలాగానో వెంటనే కంటికి కనబడేది కాదు. అటువంటి వివక్షలను కూడా గుర్తించి, వాటికి తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు ఈ కథ నాకు గొప్పగా అనిపించింది. ‘ఎర్రగళ్ల చొక్కా’ మిగిలిన కథలతో పోలిస్తే విలక్షణమైనది. విషాదాంతం అవటమే కాకుండా జీవితంలో ఉండే అసంబద్ధతని చిత్రీకరించిన, ఓ హెన్రీ తరహా, కథ ఇది. ‘శ్రీ ఏడుకొండలు 16 ఎం ఎం సినిమా కంపెనీ’ ఒక ఫీల్ గుడ్ ఉదంతం. ‘నాగ మల్లేశ్రి’ కథ చదువుతుంటే పల్లెటూళ్ళలో చిన్న చిన్న స్కూళ్ళలో పనిచేస్తుండే ఎంతో మంది ముందుకొచ్చి నిలబడ్డట్టుగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలలో పుట్టి, ఏదో ఒక ఇబ్బంది ఉండి, బంధువుల ఇళ్ళలో ఉండవలసి వచ్చిన ఎంతోమంది ఆడ పిల్లలకి ‘సరోజ’ తరహా అనుభవం ఉండే అవకాశం ఎంతో ఉంది. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి కథలోనూ ఒక ప్రత్యేకత, ఒక వాస్తవికత ఉంది. అన్నింటిలో అంతర్లీనంగా కనిపించేది ఒక జీవకాంక్ష, మనుషుల మంచితనము, తమమీద, ఇతరుల మీద నమ్మకం, ఆత్మాభిమానం, కష్టాలకి భయపడాని తత్వం.
సుజాత గారి ప్రతి వాక్యము తీర్చి దిద్దినట్టు ఉంది. మొత్తానికి చూస్తే ప్రతి కథా చక్కగా కట్టిన పక్షి గూడులా మంచి అల్లికతో, తూకంగా ఉందని నాకు అనిపించింది.
భాష
‘వివిధ ప్రాంతాలు తిరుగుతూ స్థానికులకు అనుకూలంగా ఉండే భాష మాట్లాడుతూ ఒరిజినల్ భాష తన లక్షణాలు పోగొట్టుకుని పాలిష్ అయ్యి న్యూట్రలైజ్ అయ్యింది’ - అని సుజాత గారు అన్నమాట అక్షరాలా నిజం. మా నాన్నగారు తెలుగు పండిట్ కనుక, నేను మొదటి నుంచీ చదువుకున్నది అనేక ప్రాంతాల మేలు కలయికలైన హాస్టళ్లలో అవటం మూలాన, మొదలే నాకు ప్రాంతీయ యాస అలవాటు లేదు. ఆపైన తెలుగు మాట్లాడని ప్రాంతాల్లో ఉండటం వలన ఇక మిగిలింది పుస్తకాల భాషే. అటువంటి నాకు నరసరావుపేట, చుట్టు పక్కల పల్లెటూళ్ళలో ఉండే మా చుట్టాలు ఎందరో మాట్లాడే అలవాటైన భాష ఈ పుస్తకంలో కనబడింది. కొన్ని మాటలయితే, చదువుతుంటేనే ఎవరో ఒకళ్ళ గొంతులో వినిపించేయి.
ఇంతకీ..
మొత్తంగా చూస్తే సుజాత గారి కథలు పల్నాటి వాతావరణాన్ని, స్త్రీల ధిక్కారాన్ని, వాస్తవికమైన మనిషితనాన్నీ చక్కగా చిత్రీకరించాయని చెప్పవచ్చు. ఈ విషయాలలో ఆసక్తి ఉన్న ఎవరైనా తప్పక చదవలసిన పుస్తకం ఇది. ఎనభైయ్యవ దశకంలో నరసరావుపేట చుట్టుపక్కల పుట్టిపెరిగిన వాళ్లయితే వెంటనే కొనేసుకోండి.
కొన్ని చిన్న అప్పుతచ్చులు - ‘నాకిట్టాంటి జోకులు నాకు నచ్చవబ్బాయ్’ (పుట.28 ), స్వరాజ్యం కథ మధ్యలో బంధువులు తిట్టి పోసిన “సీతమ్మ” (పుట.119) - ఇట్లాంటివి నాకు మాత్రమే కనిపిస్తాయో ఏం పాడో!
“ఈ లోకం ఎవరికైతే అన్యాయం చేసిందో, ఈ లోకం ఎవరినైతే మాట్లాడకుండా చేసిందో.. వాళ్ళని అచ్చులో ఉంచడమే మా ప్రాధాన్యత” అని ‘మనలో మన మాట’గా రాసుకున్న ’ఒక పబ్లికేషన్స్’ నుంచీ ఇది మూడో పుస్తకం. వాళ్ళ ప్రాధాన్యతలు ఇలానే ఉంచుకుంటూ ముందుకు సాగుతారని కూడా ఆశిద్దాం.
సుజాత వేల్పూరి.2025. ఒక పబ్లికేషన్స్.