రచయితలూ రకాలూ…
రచయితలు, వారి రాతలు, రెండు రకాలు. అసలైతే చాలా రకాలు, కానీ ప్రస్తుతం రెండిటి గురించి మాట్టాడదామనుకుంటున్నా.
తాము చెబుతున్నదాన్ని దగ్గరగా చూసి, అనుభవించి, ఆనందమో, ఆవేదనో చెంది, దాని గురించి ఆలోచించి, ఇతరులతో అది పంచుకోవాలని తపన చెంది, రాసే వాళ్ళు మొదటి రకం. ఈ రకం రాతల్లో ఒక నిజాయితీ ఉంటుంది. మెదడుతో పాటు మనసు వాడి రాసిన ఆనవాళ్లు కనబడతాయి.
ఇక రెండో రకం ముఖ్యంగా బుద్ధి జీవులు. వారికి చాలా విషయాలు తెలుసు. వీరు ఆలోచిస్తారు. ఊహిస్తారు. ఒక నిశ్చయానికి వస్తారు. అక్కణ్ణుంచీ రాసుకుంటూ పోతారు. వీరి భావాలూ, వస్తువులూ చాలా వరకు అరువు తెచ్చుకున్నవే. కొన్నిసార్లు భాష కూడా అరువు తెస్తారు. వీరిలో కొందరు గొప్ప పండితులు, మహా మహా వేత్తలు ఉంటారు. చాలా శ్రమపడి వివరంగా రాస్తారు. సాము గరిడీలు చేస్తారు. అయితే వీటిలో మనసు తడి ఉండదు.
ఈ రెంటి మధ్య తేడా ఎటువంటిది? ఒకటి ఇంట్లో పప్పన్నం, రెండోది స్టార్ హోటల్లో దాల్-చావల్; ఒకటి మన ఊరికి సెలవలకెళ్లడం, రెండోది ఫారిన్ ట్రిప్పు.