రెండు గాథలు

poetry
classics
telugu
Published

April 21, 2020

మావానికితర వనితల
సావాసము కలుగునట్లు సవరింపవె, యో
దేవా! యెపుడు నొకయంగన
నే వలచిన మంచిచెడ్డలెరుగరు పురుషుల్

(దేవుడా, నా ప్రియుడికి వేరే అమ్మాయిల మీద ఇష్టం కలిగేట్టు చెయ్యి. ఎప్పుడూ ఒకే అమ్మాయిని ప్రేమించే మగవాళ్లకి మంచి చెడ్డలు తెలియకుండా పోతాయి)

“ఎవరబ్బా ఈవిడ, పోటీకి ఎవరూ లేరని సంతోషించక, ఈ ప్రార్థన ఏవిటీ? నిజంగా ప్రియుడి సుఖసంతోషాలు కోరుకోవటం అంటే ఇది కదా!”

అనుకునే లోపల,

“శృంగారనాయికగా తక్కినవారికంటే తనయందుగల విశేషమును ఈ కృత్రిమ ప్రార్థన మూలమున ఈమె భావించి గర్వించుచున్నది” అని గుట్టు విప్పేశారు, రాళ్లపల్లి వారు.

“నా అంతటిది దొరికితే, వెళ్తాడులే, చూద్దాం!” అంటుందన్నమాట. మాయమ్మే! సత్యభామ నీకు చెల్లెలేగదా!

***

పెడమొగంబు బెట్టి పడకపై నేనుండ
వేడి యూర్పులిట్లు వెనుకనూర్చి
మొదలు వగలబెట్టి యెదగాల్చినది గాక
యేల వీపు గాల్చె దిపుడు పోర!

అతనేదో చేశాడు. అమ్మాయికి కోపం వచ్చింది. రాత్రి పక్కమీద అటు తిరిగి పడుకుంది. వెనక అతను వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు.

‘పగలు నీ ఇష్టం వచ్చింది చేసి, మనసు కాల్చింది కాక, ఇప్పుడు నా వీపుకూడా కాలుస్తావా’ అంది. తర్వాత కోపం తగ్గిపోయింది అని కవి ఉద్దేశ్యం.