Supermoon…

classics
poetry
telugu
Published

May 26, 2021

ఈవేళ చంద్రుణ్ణి చూస్తే ఆంధ్ర కవితా పితామహుని వర్ణనకి తగ్గట్టుగా ఉన్నాడనిపిస్తుంది. 😊

కలశపాథోరాశిగర్భవీచిమతల్లి
కడుపార నెవ్వాని గన్న తల్లి
యనలాక్షుఘనజటావనవాటి కెవ్వాడు
వన్నెవెట్టుననార్తవంపుబువ్వు
సకలదైవతబుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టుగానని మేని మెట్ట పంట
కటికచీకటితిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారిమఱది
కళలనెలవగువాడు చుక్కలకుఱేడు
మిసిమిపరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొరజోడు రేవెలుంగు.

పాలసముద్రం మధ్యలో ఉన్న అందమైన తరకల నుంచీ పుట్టినవాడు, శివుని దట్టమైన జడలనే తోటలో, ఋతువులతో సంబంధం లేకుండా ఎల్లకాలాలలోను పూచే పుష్పమై అందాన్ని చేకూర్చేవాడూ, కనీస సంరక్షణ కూడా ఆశించకుండా, మొలకకూడా తెలియకుండా పెరిగి దేవతలకు ఆహారం సమకూర్చేవాడు, చిక్కటి చీకటిని కూడా పోగొట్టే తన కిరణాలతో కలువ కన్యలకు గిలిగింతలు పెట్టి నవ్వించేవాడు, సాక్షాత్తు విష్ణువుకు మరిది, పదహారు కళలకు నెలవైన వాడు, నక్షత్రాలకు రాజు, మన్మథునికి మేనమామ, వేల వేల వెలుగులు కల సూర్యునికి జతగాడు, రాత్రి ప్రకాశించేవాడు అయిన చంద్రుడు.