తపోభంగము – కుమార సంభవము
కరుణశ్రీ రచనల్లో కొంచెం ఎక్కువ ప్రసిద్ధమైన పుష్ప విలాపము, కుంతీ కుమారితో పాటు ధనుర్భంగము, తపోభంగము నాకు బాగా నచ్చినవి. ముఖ్యంగా తపోభంగంలో ‘మంచు గుబ్బలి గుహలలో మారుమ్రోగె, తేటి జవరాలి జాలి కన్నీటి పాట’ అని రతీదేవి దుఃఖం గురించి రాసిన రెండు వాక్యాలు, నన్ను చిన్నప్పుడు చాలా ఆకట్టుకున్నాయి. అందరూ ముఖ్య కథలో, శివ పార్వతుల వివాహంలో, రాబోయే దేవాసుర సంగ్రామం కోసం జరగవలసిన కుమార జననంలో పడి కొట్టుకుపోతుండగా, ఈ కవి ఆగి రతీదేవి కష్టాన్ని కూడా గమనించాడే అనుకున్నట్టు గుర్తుంది.
అయితే, ఆ తర్వాతి పద్యంలోనే కరుణశ్రీ ‘ఆ కరుణ గానమే – ఆయనంత విరహ విశ్వ సంగీతమే – పంచమస్వరాన గానమొనరించినది మన కాళిదాస కోకిలమ్ము- వియోగినీ కూజితముల’ అని రాసినా, ఇన్నాళ్ళకిగానీ కుమారసంభవం చదువుకోలేకపోయాను. ఇప్పుడు చూస్తే, కాళిదాసు రతివిలాపం వర్ణిస్తూ నలభై ఆరు శ్లోకాలతో ఒక పూర్తి సర్గ రాసి ఉన్నాడు! అది ఇంకోసారి.
తపోభంగంలో నాకు బాగా నచ్చి, నేర్చేసుకున్న పద్యం ఇది.
అందము చిందిపోవ చెవియందలి చెందొవ జారుచుండ “పూ
లందుకొనుం” డటంచు సుమనోంజలి ముందుకు చాచి శైలరా
ణ్ణందన వంగె – చెంగున ననంగుని చాపము వంగె – వంగె బా
లేందుధరుండు కాన్కలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై.
అందం చిందిపోతూ, చెవిలో ఎర్ర కలువ జారుతుండగా, పూలు నిండిన దోసిలి ముందుకు చాచి పార్వతి వంగినది. వెంటనే మన్మథుని చేతిలో విల్లు వంగింది. ఆమె మన్మథుడి విల్లులా ఉన్నది అని చెప్పకనే చెప్పటం చమత్కారం. కూర్చుని ఉన్న శివుడు, శరీరంలో పై భాగం పైకి లేచినట్టుగా (ఉన్నమిత ఊర్ధ్వ కాయుడై), కానుక తీసుకోవటానికి వంగాడట.
కుమారసంభవంలో పార్వతీదేవి వంగి నమస్కరిస్తుంది.
ఉమాపి నీలాలకమధ్యశోభి విస్రంసయన్తీ నవకర్ణికారమ్
చకార కర్ణచ్యుత పల్లవేన మూర్ధ్నా ప్రణామం వృషభ ధ్వజాయ (3.62)
ఉమాపి నీలాలకమధ్యశోభి నవకర్ణికారమ్ విస్రంసయన్తీ కర్ణచ్యుత పల్లవేన మూర్ధ్నా వృషభ ధ్వజాయ ప్రణామం చకార – పార్వతీదేవి నల్లని ముంగురుల మధ్యలో శోభిస్తున్న కొండగోగు పూలు, చెవిలో (అలంకారంగా) ధరించిన చిగురుటాకు, జారుతుండగా (జారి శివుడి పాదాలపై పడుతుండగా), తలవంచి వృషభ ధ్వజునికి నమస్కరించింది.
మన్మథుడు విల్లు వంచుతాడు.
కామస్తు బాణావసరం ప్రతీక్ష్య పతన్గవద్వగ్నిముఖం వివుక్షుః
ఉమాసమక్షం హరబద్ధ లక్షశ్సరాసనజ్యాం ముహూరామమర్శ (3.64)
మన్మథుడు కూడా, బాణం వేయటానికి సరైన సమయాన్ని చూసినవాడై, అగ్నిముఖంలోకి ఉరకడానికి సిద్ధపడిన మిడుతలా, ఉమా సమక్షంలో ఉన్న హరునిపై గురిపెట్టబడిన వింటి నారిని మరల మరల సవరిస్తున్నాడు.
నమస్కరించిన పార్వతి, స్వర్గంగలో పూచిన తామరల ఎండు గింజలతో చేసిన జపమాలని శివునికి కెంగేలితో కానుక పడుతుంది.
శివుడు అది తీసుకోవటానికి సిద్ధపడతాడు. వెంటనే మన్మథుడు బాణం సంధిస్తాడు.
ప్రతిగృహీతుం ప్రణయి ప్రియత్వాత్ త్రిలోచనస్తాముపచక్రమే చ
సంమోహనం నామ చ పుష్పధన్వా ధనుష్యమోఘం సమధత్త బాణం (3.66)
త్రిలోచనః చ ప్రణయి ప్రియత్వాత్ తాం ప్రతిగృహీతుం ఉపచక్రమే| పుష్పధన్వా చ సంమోహనం నామ అమోఘం బాణం ధనుషి సమధత్త |
త్రిలోచనుడు ఆ మాలను తీసుకోవటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? ప్రణయి ప్రియత్వాత్ – తనను అర్థించే వారిపై ప్రియత్వము కలవాడు కనుక. వెంటనే మన్మథుడు అమోఘమైన సమ్మోహనం అనే బాణాన్ని సంధించాడు.
తరువాయి సన్నివేశం – తపోభంగంలో మన్మథుడు బాణం వేస్తాడు, అది శివుడికి గుచ్చుకుంటుంది.
తియ్యవిల్కాడు వింట సంధించి విడచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి
గ్రుచ్చుకొనెనది ముక్కంటి గుండెలోన.
ఆ ప్రభావంలో శివుడు పార్వతి చెయ్యి పట్టుకుంటాడు.
స్వర్ణదీ స్వర్ణ కంజ కింజల్కములకు
పసిమి దిద్దెడి గిరికన్య పాణితలము
పట్టుకొని వీడగా లేడు భవుడు; మేను
పులకరింపగ, వలపులు తొలకరింప
ఆయన పట్టుకున్న చెయ్యి ఎటువంటిది? స్వర్గంగలో ఉండే బంగారు తామరతూళ్ళకి మెరుగులు దిద్దగలది.
ఆమె కొంచెం సిగ్గుతో వారిస్తుంది.
ముద్దులొలికెడు పగడాల మోవిమీద
తళుకు చిరునవ్వు ముత్యాలు తద్గుణింప
“స్వామీ! యేమిది?” యనుచు లజ్జా వినమ్ర
ముఖియయి యొకింత వారించె ముగుద మునిని.
కుమార సంభవం లో మాత్రం మన్మథుడు బాణం కూడా వేయడు; శివుడు కూడా పార్వతిని ఊరికే సాభిప్రాయంగా చూస్తాడు, అంతే.
హరస్తు కించిత్ పరిలుప్త ధైర్యః చంద్రోదయారంభ ఇవాంబురాశిః
ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని
చంద్రోదయ సమయంలో సముద్రంలా, కొంచెం తగ్గిన ధైర్యంతో శివుడు బింబాధర అయిన ఉమ ముఖాన్ని చూశాడు.
వివృణ్వతీ శైల సుతాపిభావ మంగైస్ఫురద్బాలకదంబ కల్పైః
సాచికృతా చారుతరేణ తస్థౌ ముఖేన పర్యస్త విలోచనేన
పార్వతీ దేవి కూడా వికసించిన బాల కదంబ వృక్షంలా పులకించినదై, శృంగార భావాన్ని తెలియజేస్తూ, అందమైన, సిగ్గుతో చెదిరిన కన్నులు కల ముఖము పక్కకు తిప్పుకున్నది.
వెంటనే శివుడు నిగ్రహించుకుని చుట్టూ చూస్తే, మన్మథుడు కనిపిస్తాడు. మూడో కంటినుండి వచ్చిన జ్వాలలలో భస్మమవుతాడు. అందరూ అక్కడి నుంచీ వెళ్లి పోతారు.
ఇవి రెండూ మళ్ళీ పక్కపక్కన చదువుకున్న తర్వాత, నాకైతే పార్వతి, శివుడు, మధ్యలో పూలతో, ఒకరివైపు ఒకరు వంగడమూ, అదే సమయంలో మన్మథుడి విల్లు వంగడమూ, ఆ సందర్భంగా పార్వతి మన్మథుని విల్లు వంటిదనే చమత్కారమూనే ఎక్కువ నచ్చాయి.
అలాగే, తర్వాతి సందర్భంలో శివుడి పాత్ర నిర్వహణలో ఔచిత్యం దెబ్బ తినకుండా కేవలం ఒక చూపుతోనే ఆయన అధైర్యాన్ని నిలిపి వేసి, నిజానికి శివుణ్ణి పెళ్ళాడాలని ఉన్న పార్వతిలో కలిగిన అలజడిని సరిగా, అంటే కొంచెం ఎక్కువగా, చూపించటం ద్వారా, తరువాతి కథలో ఆమె శివుడి కోసం తపస్సు చేసే సందర్భాన్ని సూచించి ముగించిన కాళిదాసు కథాక్రమమే నచ్చింది.